Friday, January 29, 2010

కుండకి- ఫ్రిజ్‌కి తేడా ఏంటి?, Pot and Fridge-Difference







ప్రశ్న: కుండలోని నీరు చల్లబడడానికి, ఫ్రిజ్‌లోని నీరు చల్లబడడానికి ఉన్న తేడా ఏంటి?

జవాబు: కుండలో నీరైనా, ఫ్రిజ్‌లో నీరైనా చల్లబడడం అంటే ఆ నీటిలోని ఉష్ణశక్తి(thermal energy) తగ్గడమే. కొత్త కుండలో నీరు తనలోని ఉష్ణాన్ని త్యాగం చేసి తద్వారా కొంత నీటిని ఆవిరి రూపంలో సాగనంపడం ద్వారా చల్లబడుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన నీటి ఉష్ణాన్ని, ఫ్రిజ్‌లోని శీతలీకరణ వ్యవస్థ తగ్గిస్తుంది. కొత్త కుండల గోడలకు కంటికి కనిపించని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా నీటి అణువులు కుండ ఉపరితలం మీదకు చెమరుస్తాయి. అక్కడ అవి ద్రవస్థితి నుంచి వాయు స్థితికి ఆవిరవుతాయి. నీరు ద్రవస్థితి నుంచి వాయి స్థితికి మారాలంటే కొంత ఉష్ణశక్తి అవసరం. ఈ శక్తిని అవి కుండ గోడలనుంచి, కుండలో నీటినుంచి తీసుకుని ఆవిరవుతాయి. తద్వారా కుండలోని నీరు చల్లబడతుంది. ఇందుకు తగిన పరిస్థితులు వేసవిలో ఎక్కువగా ఉండడం వల్ల ఆ కాలంలో కుండలో నీరు చల్లగా మారడాన్ని స్పష్టంగా గమనించగలుగుతాం. ఇక ఫ్రిజ్‌ విషయానికి వస్తే అందులో శీతలీకరణ ప్రక్రియ వల్ల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. అందువల్ల అందులో ఉంచిన నీటి ఉష్ణోగ్రతను ఫ్రిజ్‌ పరిసరాలు గ్రహిస్తాయి. తద్వారా ఫ్రిజ్‌లో నీరు చల్లబడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కుండలో నీరు తానే ఉష్ణాన్ని వదిలేసి చల్లబడితే, ఫ్రిజ్‌లో నీటి నుంచి ఉష్ణాన్ని ఫ్రిజ్‌ లాగేస్తుంది.

====================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...