Monday, January 25, 2010

అంతరిక్ష నౌకలు ఉల్కల్లా మండిపోవేం?,Setellites won't burn-why?




ప్రశ్న: రోదసి నుంచి రాలే ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయి. కానీ స్పేస్‌ షటిల్స్‌కు ఆ ప్రమాదం లేదు. ఎందుకని?

జవాబు: రోదసిలోని శూన్యం గుండా ఉల్కలు (meteors) భూ వాతావరణంలోకి గంటకు వేలకొద్దీ కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తాయి. అలా వచ్చే ఉల్క వాతావరణాన్ని ఢీకొనగానే అక్కడున్న గాలి అత్యంత ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల అక్కడి గాలి ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఆ ఉష్ణం వల్ల అతిగా వేడెక్కిన ఉల్క వెలుగులు చిమ్ముతూ పూర్తిగా ఏమీ మిగలకుండా మండిపోతుంది. అలా వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క ఉష్ణోగ్రత దాదాపు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చేరుకుంటుంది.
అలాగే అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు కూడా ఇంతటి ఘర్షణ ఏర్పడుతుంది. అయితే అది ఉల్కలా మండిపోకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అంతరిక్ష నౌక ఉపరితలంపై సిలికా, సిలికాన్‌డై ఆక్సైడ్‌ పూతపూసిన పలకలను అమరుస్తారు. ఈ పలకలు 93 శాతం వరకు సచ్చిద్రత (porosity) అంటే అతి సన్నని రంధ్రాలను కలిగి ఉంటాయి. అందువల్ల అంతరిక్ష నౌక వాతావరణంలోకి ప్రవేశించినపుడు జనించే అత్యధిక ఉష్ణశక్తి, ఆ పలకల్లో ఒక భాగం నుంచి మరో భాగానికి ప్రవహించదు. సిలికాన్‌ ఉష్ణ వ్యాకోచ ధర్మం (thermal expansion), ఉష్ణ వాహకత్వం (thermal conduction) అతి తక్కువ. అందువల్ల సిలికా పలకలు సంపూర్ణ అధమ వాహకాలు(perfect insulators) గా పనిచేస్తాయి.
సిలికా పలక అంచులను రెండు చేతులతో పట్టుకుని దాని మధ్య ప్రదేశాన్ని ఎర్రని వెలుగు వచ్చే వరకు వేడి చేసినా, ఆ ఉష్ణం పలకను పట్టుకున్న వ్యక్తి చేతులకు సోకదు. అంటే ఆ ఉష్ణశక్తి పలకల అంచులకు చేరుకోదన్నమాట. వీటివల్లనే అంతరిక్ష నౌకలు క్షేమంగా భూమి పైకి చేరుకోగలుగుతాయి.





===========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...