Friday, January 29, 2010

నదులు-చెరువుల్లో కెరటాలుండవేం?, Tides not seen on lakes-Why?





ప్రశ్న: సముద్రంలోలాగా నదులు, చెరువుల్లో కెరటాలు ఎందుకు రావు?

జవాబు: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే, ఎంత జలాశయానికి అంత కెరటాలు అనుకోవచ్చు. నదులు, చెరువులు, సరస్సుల్లో అలలుంటాయి కానీ కెరటాలు ఉండవు. నదులు ప్రవాహ రూపంలో ఉంటాయి కాబట్టి వాటిలోని అలలను మిగతా వాటితో పోల్చలేం. సముద్రాలు, సరస్సులు, చెరువుల్లో ఏర్పడే అలలు ఉష్ణశక్తి సంవహనం (thermal convection), ఉష్ణోగ్రతా దొంతరలు (temperature contours), జలగతిక నియమాల (hydrodynamics) సమష్టి ఫలితంగా ఏర్పడుతాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను స్థూలంగా అర్థం చేసుకుందాం.

నీరు అధమ ఉష్ణవాహకం. నేల కన్నా నీటిలో ఉష్ణప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. లోతైన సముద్రప్రాంతం, లేదా చెరువులో మధ్య భాగాలను తీసుకుంటే అక్కడ నీటి ఉష్ణోగ్రత, ఒడ్డున ఉన్న నీటి ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మధ్యలోని నీటి నుంచి, ఒడ్డున ఉండే నీటికి ప్రసారమవుతూ ఉంటుంది. ఇలా ప్రసారమయ్యే ప్రక్రియలో పైన చెప్పుకున్న నియమాల ద్వారా నీటి అడుగున అనుదైర్ఘ్య తరంగాలు (longitudinal waves) ఏర్పడుతాయి. చుట్టుపక్కల ఒత్తిడుల వ్యత్యాసాల వల్ల నీరు పైకి ఉబ్బి అలల్లా ఏర్పడుతాయి. వీటిని తిర్యక్‌ తరంగాలు (transverse waves) అంటారు. ఇవి ఆ జలాశయం లోతును బట్టి వేగాన్ని సంతరించుకుంటాయి. ఇవి ఒడ్డుకు చేరుతున్న కొద్దీ తరంగాల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇవే పెద్ద అలలు. చెరువులు, సరస్సుల్లాంటి జలాశయాలతో పోలిస్తే, సముద్రంలో లోతు అధికం కాబట్టి ఈ అలలు క్రమేణా కెరటాలుగా మారతాయి.


ప్రశ్న: సముద్రంలో కెరటాలు విపరీతంగా ఎందుకు వస్తాయి? నదులు, వాగుల్లో అలా రావెందుకని?

జవాబు:
కొంచెం లోతైన ప్లాస్టిక్‌ పళ్లెంలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి ఊదితే, పళ్లెం అంతటా చిన్న తరంగాలు కదలడాన్ని గమనించవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడుతాయి.
భూమి ఏర్పడిన తొలి నాళ్లలో ఖండాలన్నీ ఒకే భూభాగంగా కలిసి ఉండేవి. ఈ ఖండాలకు ఆధారమైన ఫలకాలు భూమి లోపల ఉండే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల, ద్రవరూపంలో ఉన్న రాళ్ల కదలికల వల్ల ఒక దానికొకటి దూరంగా కదలసాగాయి. ఆ విధంగా భూమి ఖండాలుగా విడిపోయిన తర్వాత మధ్యలోని లోతైన అగాథాల్లో సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రంపై ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల కెరటాలు ఏర్పడుతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. పైకి లేచిన కెరటం కిందికి పడినప్పుడు ఏర్పడే గతిజశక్తి (కైనెటిక్‌ ఎనర్జీ) వల్ల కూడా కొంత నీరు పైకి లేస్తుంది. పైకీ కిందికీ ఊగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల నీటిలో కూడా వ్యాపించి కెరటాలు నిరంతరంగా ఏర్పడుతాయి. సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండడంతో కెరటాల కదలికలకు ప్లవన శక్తి(buyoncy) కూడా తోడై, మరిన్ని కెరటాలు పుడతాయి. సముద్రంపై వీచే గాలి వేగం ఎక్కువయ్యే కొలదీ కెరటాల ఎత్తు ఎక్కువవుతుంది. అంటే నిలకడగా ఉన్న లోతైన నీటిపై గాలి వీయడం వల్ల సముద్రంలో కెరటాలు ఏర్పడుతాయి. అదే నిలకడ లేకుండా వేగంగా నీరు ప్రవహిస్తున్న నదులు, వాగుల్లో కెరటాలు అంతగా ఏర్పడే అవకాశం లేదు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ===============================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...