Friday, January 29, 2010

టీవీ దగ్గర అలా జరుగుతుందేం?, T.V.and Hair straightening





ప్రశ్న:
టీవీ తెరపై దుమ్మును గుడ్డతో తుడిచేప్పుడు మన చేతి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకని?

జవాబు:
అది స్థిర విద్యుత్‌ (static electricity) ప్రభావం. ప్రతి పదార్థంలో పరమాణువులు ఉంటాయి. వాటి కేంద్రకం (nucleus)లో ధనావేశంతో ఉండే ప్రోటాన్లు, ఏ ఆవేశం లేని న్యూట్రాన్లు కట్టగట్టుకుని ఉంటే, ఆ కేంద్రకం చుట్టూ రుణావేశం ఉండే ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక పరమాణువులో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో, అన్నే ఎలక్ట్రాన్లు ఉంటాయి. కేంద్రకం నుంచి దూరంగా ఉండే కక్ష్యలో తిరిగే ఎలక్ట్రాన్లపై కేంద్రకం ఆకర్షణ ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఇక టీవీ తెర విషయానికి వస్తే, దాన్ని ఏదైనా గుడ్డతో తుడిచేప్పుడు తెరమీది పరమాణువులు, గుడ్డలోని పరమాణువుల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణశక్తిని తెర పరమాణువుల బాహ్య కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్లు గ్రహించి, తెర నుంచి విడివడి గుడ్డలో ఉండే పరమాణువుల బాహ్య కక్ష్యను చేరుకుంటాయి. ఎలక్ట్రాన్లను కోల్పోయిన తెర ఉపరితలపు పరమాణువులలో ధనావేశం ఉండే ప్రోటాన్ల సంఖ్య ఎక్కువవడంతో తెర ధన విద్యుదావేశాన్ని పొందుతుంది. ఎలక్ట్రాన్లను పొందిన గుడ్డ రుణ విద్యుదావేశాన్ని పొందుతుంది. మనం వాడే గుడ్డ స్వభావాన్ని బట్టి ఈ విద్యుదావేశాలు తారుమారు కూడా కావచ్చు. అంటే ఏదైనా రెండు పదార్థాలను ఘర్షణకు గురి చేస్తే వాటికి విద్యుదావేశం వస్తుంది. అలా ధన విద్యుదావేశం పొందిన తెర ఉపరితలం తిరిగి తన యధాస్థితిని పొందడానికి మన చేతిపై ఉండే పరమాణువుల ఉంచి ఎలక్ట్రాన్లను గ్రహించే ప్రయత్నం చేస్తుంది. అందువల్లనే చేతి మీది వెంట్రుకలు తెరవైపు లాగినట్టయి నిక్కబొడుచుకుంటాయి. గాలి నింపిన బెలూనును బాగా రుద్ది వదిలేసినా అది మన దేహానికి అంటిపెట్టుకుని ఉంటుంది. దీనికి కూడా కారణం ఇదే.


ప్రశ్న:
మనం టీవీని ఆఫ్‌ చేసిన వెంటనే తెరమీద చెయ్యి ఉంచితే, వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటాయి. ఎందుకు?

జవాబు:
టీవీ తెర నిజానికి శూన్యంతో కూడిన గోళం (vacuum tube)లో భాగం. టీవీ తెర వెనుక గాలి ఏమాత్రం ఉండదు. ఆ గోళానికి వెనుక భాగంలో ఎలక్ట్రాన్లను జనింపజేసే ఫిలమెంట్లు ఉంటాయి. అలా విడుదలైన ఎలక్ట్రాన్లు వేగంగా వచ్చి టీవీ తెర వెనుక భాగాన్ని తాకే ఏర్పాటు ఉంటుంది. అక్కడ ఫాస్ఫారిసెన్స్‌ పూత పూసిన సూక్ష్మమైన బొడిపెలపై ఎలక్ట్రాన్లు పడి నప్పుడు అవి వెలగడం వల్ల మనకు ఇవతలి వైపు నుంచి దృశ్యం కనిపిస్తుంది. అత్యధిక విద్యుత్‌ ప్రసారం వల్ల ఎంతో వేగంతో ప్రయాణిస్తూ వచ్చే ఎలక్ట్రాన్లు టీవీ తెరపై ఉండే ఎలక్ట్రాన్లను నెట్టివేస్తాయి. అందువల్ల టీవీ తెర పాక్షికంగా ధనావేశంతో స్థిర విద్యుత్‌ (static electricity)ను పొంది ఉంటుంది. టీవీ ఆఫ్‌ చేసినా ఆ విద్యుదావేశం ఇంకా కొంత ఉంటుంది. అప్పుడు మనం చేయిని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు మన వెంట్రుకల్లోని వ్యతిరేక విద్యుదావేశం ఆకర్షణకు గురవుతుంది. అందువల్లనే రోమాలు టీవీ తెరవైపు నిక్కబొడుచుకుంటాయి.
  • =================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...