Monday, January 25, 2010

చంద్రునిపై నీరుండడం నిజమేనా?,Water on the Moon




ప్రశ్న: 'ఇస్రో' శాస్త్రజ్ఞులు ప్రయోగించిన చంద్రయాన్‌-1 ద్వారా చంద్రునిపై నీరున్నట్లు గుర్తించారని చదివాను. అసలు, చంద్రునిపై నీరు ఎలా సాధ్యం?

జవాబు: చంద్రునిపై నీరుందని ఇస్రో శాస్త్రజ్ఞులు ప్రకటించారంటే, అక్కడ నీరు సముద్రాలు, కాలువల రూపంలో ఉందని కాదు. నీటికి సంబంధించిన హైడ్రాక్సైల్‌ (హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల సమ్మేళనం) అణువులను మాత్రమే చంద్రయాన్‌లోని ఒక పరికరమైన 'మూన్‌ మినరాలజీ మాపర్‌' ద్వారా గుర్తించారు.

ఆ విధంగా జాబిలిపై జలం ఆనవాళ్లు ఉండటానికి ఒక కారణం చంద్రుని ఉపరితలాన్ని 3.9 బిలియన్‌ సంవత్సరాల క్రితం క్రమం తప్పకుండా ఢీకొన్న తోక చుక్కలు (comets), ఉల్కలు (meteorites) కావచ్చు. ఇవి తమలో ఉన్న నీటిని అక్కడ వదలి ఉండాలి. ఆ నీటిలో చాలావరకు ఆవిరయిపోగా ఇపుడు గర్తించిన నీటి ఆనవాళ్లు మిగిలిన నీటికి సంబంధించినవి.

మరోకారణం, చంద్రుని ఉపరితలాన్ని అతి వేగంగా తాకుతున్న సూర్యుని నుంచి వీచే అతి శక్తిమంతమైన గాలుల (solar winds) లోని ప్రోటాన్లు. ఈ ప్రోటాన్లు, అందులో ఉండే హైడ్రోజన్‌ అయాన్లు చంద్రుని ఉపరితలాన్ని అత్యంత వేగంతో అంటే, సెకనుకు 100 కిలోమీటర్లు వేగంతో ఢీకొంటున్నాయి. సూర్యుని ఉపరితలంలోని నేలలో, రాళ్లలో 40 శాతం ఆక్సిజన్‌ ఉంది. సూర్యుని నుంచి వేగంగా వచ్చిన ప్రోటాన్ల అభిఘాతాల (collisions) వల్ల చంద్ర శిలలు, నేలలోని ఆక్సిజన్‌ విడుదలై ప్రోటాన్లలోని హైడ్రోజన్‌తో కలిసి నీటికి సంబంధించిన హైడ్రాక్సైల్‌ అణువులను చంద్రునినపై ఏర్పరిచి ఉండవచ్చు.

ఈ నీటికి సంబంధించిన అణువులు ధృవాల దగ్గర ఎక్కువగా ఉన్నాయని, అక్కడ నుంచి 10 డిగ్రీలమేర ఉత్తర, దక్షిణ దిశలకు చంద్రుని నేలలో వ్యాపించాయని చంద్రయాన్‌-1 ప్రయోగం నిర్ధరించింది. ఒకటన్ను చంద్రుని మట్టిలో ఒకలీటరు నీరు ఉండవచ్చని శాస్త్రజ్ఞుల అంచనా.

మన దేశానికి చెందిన ఇస్రో ప్రయోగం చంద్రుని భూమిలో ఒక సెంటీమీటరు లోతులో ఉండే నీటి ఆనవాళ్లను కనుగొనగా, అమెరికాలోని 'నాసా' జరిపిన ప్రయోగం ఇంకా లోతుగా ఉండే ప్రదేశంలో నీటి జాడలను అన్వేషిస్తోంది.






============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...