Saturday, June 12, 2010

ఆవలింత అంటుకుంటుందా?, Yawning is Contagious?




ప్రశ్న: ఒకరికి ఆవులింత వస్తే పక్కవారికి కూడా వస్తుంది కదా? ఇది అంటు వ్యాధా?

జవాబు: ఆవులింత అంటువ్యాధి కాదు కానీ అది అంటుకోవడం మాత్రం నిజమనే అనుకోవాలి. తల్లి గర్భంలో ఉండే శిశువు కూడా ఆవులిస్తుంది. ఎవరైనా అలిసిపోయినప్పుడో, బోరుగా ఉన్నప్పుడో ఆవులిస్తారు. ఒకోసారి దేహంలో ఉత్సాహం కలిగినప్పుడు కూడా ఇవి వస్తాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయో ఇప్పటికీ తెలియని రహస్యమే. శరీరంలో ఆక్సిజన్‌ పాలు తగ్గినప్పుడు ఆవులింత వస్తుందనే భావన నిజం కాదని తాజా ప్రయోగాలు నిరూపించాయి. ఎవరైనా ఆవులిస్తే వారి చుట్టుపక్కల వారిలో సగం మందైనా ఆ పని చేస్తారు. ఎదుటివారి పట్ల సానుభూతి చూపే స్వభావం కలవారు ఆవులింతల ప్రభావానికి సులభంగా లోనవుతారని చెబుతారు.
  •  ---------------------------------------------------------------
Yawning and relation-ఆవలింతల అనుబంధం ఎలా?

ప్రశ్న: మనం ఆవలిస్తే మనకి దగ్గరగా ఉన్నవాళ్లకి కూడా ఆవలింత వస్తుంది. ఎందుకు?

జవాబు: ప్రకృతి పట్ల స్పందించి తదనుగుణంగా ప్రవర్తనలు కలగడం జీవులకున్న ఓ ప్రధాన లక్షణం. ముఖ్యంగా నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన జీవులు, చూసే దృశ్యాలు, ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు అనుకూలంగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఒకరు ఆవలించడం చూసిన వారికి కూడా అదే స్పందన కలగడం కూడా అలాంటిదే. ఇలాంటి ప్రతిస్పందనల్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు (involuntary reactions) అంటారు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎదురుగా మంచి భోజన పదార్థాలను చూస్తే నోరూరడం, ఏదైనా భయానక దృశ్యం చూస్తే ఆందోళన కలగడం లాంటివి కూడా ఇలాంటివే. సామాజిక జీవనంతో ముడిపడి ఉన్న కొన్ని స్పందనలు ఎదురుగా ఉన్న దృశ్యాలకు ప్రతికూలంగానో, అనుకూలంగానో కలుగుతాయి. మనం ఆవలిస్తే ఎదుటివారు ఆవలించడాన్ని ప్రేరేపిత అసంకల్పిత ప్రతీకార చర్య (induced involutary reaction) అంటారు. అయితే ప్రతిసారీ ఇలా జరుగుతుందని అనుకోనక్కర్లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...