Wednesday, December 01, 2010

ఖండాలు కదులుతాయా? , Continents Moove?




ప్రశ్న: ఖండాలు కదులుతూ ఉంటాయంటారు. నిజమేనా?

- సి. అనంత పద్మనాభరావు, విజయనగరం

జవాబు: కొయ్యలు నీటిపై తేలుతాయి. కారణం వాటి సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండడమే. ఖండాల (Continents) విషయం కూడా అంతే. ఖండాలకు సంబంధించిన భూఫలకాలను 'టెక్టానిక్‌ ప్లేట్స్‌' అంటారు. వీటి పైనే పర్వతాలూ, సముద్రాలూ కూడా ఇమిడి ఉంటాయి. ఈ భూఫలకాలు చాలా బరువైన గ్రానైట్‌ రాళ్లతో కూడి ఉన్నా అవి భూగర్భంలో ఉండే శిలాద్రవంపై తేలుతూ ఉంటాయి. భూగర్భంలో ఉండే అత్యంత ఉష్ణోగ్రత వల్ల రాళ్లు సైతం కరిగిపోయే ఈ శిలాద్రవం చిక్కని బెల్లంపాకంలాగా ఉంటుంది. దీనిపైనే భూఫలకాలు, నీటిపై తెప్పల్లాగా తేలుతూ ఉంటాయి. ఈ శిలాద్రవాన్నే Mantle అంటారు. ఈ శిలాద్రవం సాంద్రత ఘనపు సెంటీమీటర్‌కి సుమారు 3.5 గ్రాములుంటుంది. గ్రానైట్‌ సాంద్రత ఘనపు సెంటీమీటర్‌కి 2.7 గ్రాములుంటుంది. అందువల్ల తక్కువ సాంద్రత ఉన్న ఖండాలు శిలాద్రవంపై తేలుతుంటాయి. ఈ భూఫలకాలు శిలాద్రవంపై తేలుతూ ఉండడమే కాకుండా కదులతూ ఉంటాయి. దీనికి కారణం భూ ఆవరణం 3000 కిలోమీటర్ల లోతు కలిగి ఉండడమే. ఆ ఆవరణం అడుగు భాగంలోని ఉష్ణోగ్రత అనేక వేల డిగ్రీలు ఉండడంతో అక్కడ నుంచి తక్కువ సాంద్రత గల ఉష్ణ ప్రవాహాలు (Heat Currents) నిదానంగా ఆవరణ పై భాగానికి చేరుకుంటాయి. అక్కడ ఆ ప్రవాహాల ఉష్ణోగ్రత తగ్గి, సాంద్రత హెచ్చడంతో మరలా అవి ఆవరణ కింది లోతులకు చేరుకుంటాయి. వీటిని సంవహన ప్రవాహాలు (Convection Currents) అంటారు. వీటి కారణంగా భూ ఆవరణలోని రాతిద్రవం ఒక భారీ కన్వేయర్‌ బెల్ట్‌లాగా పైకీ కిందకీ తిరుగతూ ఉండడం వల్ల ఉత్పన్నమైన బలంతో శిలాద్రవంపై తేలుతున్న ఖండాలు కదులుతూ ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...