Friday, January 14, 2011

సీ అర్చిన్ సంగతేమిటి?,Waht abot Sea-archin?




కళ్లు లేవు... కాళ్లు లేవు... ఒళ్లంతా ముళ్లే... అదే 'సీ అర్చిన్‌'! దీని గురించి ఓ కొత్త సంగతి బయటపడింది!

మొదటిసారి సీ అర్చిన్‌ను చూసేవారెవరైనా అది ఒక జీవని అనుకోరు. గుండ్రంటి బంతి చుట్టూ, పదునైన ముళ్లని అతికించినట్టు ఉంటుంది. వూదా, ఆకుపచ్చ లాంటి రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది సముద్రగర్భంలో ఉండే బండరాళ్లని అతుక్కుని ఉంటుంది. చూడ్డానికి కాక్టస్‌లాంటి ముళ్లమొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు దీని గురించి ఓ ఆశ్చర్యకరమైన సంగతిని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముళ్లబంతిలాంటి శరీరం అడుగున ఉండే నోటిలో అయిదు పళ్లు ఉంటాయి. త్రికోణాకారంలో ఉండే ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటిగా అతుక్కుని వలయాకారంలో ఉంటాయి. బండరాళ్లని కరుచుకుని ఉండే ఇవి ఈ పళ్లతోనే వాటిని తొలిచి రంధ్రాలు కూడా చేయగలవు. వాటిలో సురక్షితంగా కాపురముండగలవు. ఈ పళ్లతోనే అవి రాళ్లపై ఉండే నాచులాంటి ఆల్గేని గీక్కుని తింటూ ఉంటాయి. మరి ఇలా బండల్ని కూడా కొరికేసి, గీరేసి, తొలిచేస్తుంటే ఆ పళ్లెలా తట్టుకుంటున్నాయి? ఇదే సందేహం శాస్త్రవేత్తలకు కలిగింది. దాంతో వాటిని, వాటి దంతాల్ని ఆధునిక సూక్ష్మదర్శినిలు, ఎక్స్‌రే పరికరాలతో గమనించారు. అవి అరిగిపోవడం లేదు సరికదా, రాన్రాను మరింత పదునుగా తయారవుతున్నాయని కనుగొన్నారు. వీటి పళ్లు కాల్ఫియం కార్బోనేట్‌ వల్ల తయారయ్యే కాల్‌కైట్‌ (Calcite) అనే ఖనిజం వల్ల తయారవుతున్నాయని తేలింది. రాళ్లను గీరుతున్నప్పుడు ఒక అంచు అరిగిపోయినా, దాని స్థానంలో మరో అంచు వెంటనే వచ్చేలా వీటి అణువుల నిర్మాణం ఉందని కనుగొన్నారు. ఇవి ఇంత వరకు మనిషి తయారు చేసిన అన్ని పరికరాల కన్నా పదునుగా, అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. 'ఎక్కడో సముద్ర అడుగున ఉండే జీవి పళ్లు ఎలా ఉంటే మనకేం?' అనుకోకండి. ఈ పరిశోధన సాయంతో ఎప్పటికీ పదును కోల్పోని పరికరాలను తయారు చేయవచ్చనేది శాస్త్రవేత్తలు ఉద్దేశం.
* వీటికి కళ్లు ఉండవు. ఒంటిపై ఉండే ముళ్లలాంటి భాగాల చివర్లలోని కాంతి గ్రాహకాల ద్వారా పరిసరాలను గమనిస్తాయి.
* సుమారు 4 అంగుళాల పొడవు పెరిగే ఇవి ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో కనిపిస్తాయి.
* ముళ్ల లాంటి భాగాల ఆధారంగానే ముందుకు కదులుతాయి. శత్రువుల నుంచి కాపాడే రక్షణ కవచాలు కూడా ఇవే.
* వీటిలో సుమారు 200 జాతుల్ని గుర్తించారు.
* వీటిని జపాన్‌లో ఇష్టంగా తింటారు. వీటి గుడ్లను కూడా వండి వడ్డిస్తారు.


  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...