Monday, February 28, 2011

మొబులా రే సంగతేమిటి ? , What about Mobula Ray ?





చాపలా వెడల్పుగా పరుచుకున్న శరీరం, సన్నని తోకతో గాలిపటంలా కనిపిస్తోంది కదూ! ఈ మొబులా రే. సముద్రంలో అంత ఎత్తున ఎగిరి మళ్లీ కిందకి దుమికే దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది తెలుసా? ఇది ఎగిరినప్పుడు కొంత దూరం నుంచి చూస్తే చిన్న విమానం దూసుకెళ్తున్నట్టు ఉంటుంది. ఆకారం కూడా విమానాన్ని పోలినట్టే ఉంటుంది. ఈ మొబులా రేలు ఎక్కువగా మెక్సికో, కాలిఫోర్నియా తీరాల్లో కనిపిస్తాయి. వీటిని చూడటానికి బోలెడు మంది పర్యాటకులు ఈ తీరప్రాంతాల్లో గుమిగూడతారు. అవి గాలిలో ఎగురుతుంటే ఫోటోలు తీసుకుని మురిసిపోతారు.

ఎగరడం అంటే పక్షుల్లా వేల కిలోమీటర్లు ఎగిరేస్తాయనుకోవద్దు. గెంతడమన్న మాట. ఇవి ఒక్కసారిగా పైకెగిరి సుమారు రెండు మీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి సముద్రంలో దబ్బున పడతాయి. ఆ సమయంలో వాటి రెక్కల్లాంటి మొప్పల్ని దగ్గరగా తీసుకుని అచ్చు పక్షిలాగా కనిపిస్తాయి. కాస్త తీరిక దొరికితే చాలు ఇవి ఇలా ఎగురుతూనే ఉంటాయి. అసలివి మాటిమాటికీ ఎందుకు ఎగురుతున్నాయో మాత్రం ఇంత వరకు తెలియలేదు. కొందరు శాస్త్రవేత్తలు అవి ఆనందం వేసినప్పుడు అలా ఆడుకుంటున్నాయని భావిస్తే, మరికొందరు ఆహారం పట్టుకోవడంలో అదో ప్రక్రియని చెపుతున్నారు. అలా ఎగిరినప్పుడు ఒంటిపై ఉన్న వివిధ పారాసైట్‌లను కిందకి రాలిపోతాయని, అవి తినడానికి వచ్చిన చేపల్ని పట్టి తింటాయని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని నీటిలో ఒకే దగ్గర గుంపులుగుంపులుగా ఉంటాయివి. అప్పుడు చూస్తే ఆ ప్రదేశమంతా నీలం దుప్పటి కప్పినట్టుగా కనిపిస్తుంది.

ఈ మొబులా రేలు పదడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పున ఉంటాయి. బరువు ఒక టన్ను వరకు పెరుగుతాయి. రేల కుటుంబంలో మాంటారేల తరువాత ఇవే అతి పెద్ద రే జాతి. పరిమాణంలో పెద్దవే అయినా తినేవి మాత్రం రొయ్యల్లా కనిపించే క్రస్టసీన్స్‌, క్రిల్స్‌ చేపల్నే. వీటి సంఖ్య ఇప్పుడు ప్రమాదంలో పడింది. తీర ప్రాంతాల్లో ఇవి గుంపుగా ఉన్నప్పుడు జాలరులు వలలేసి పట్టేస్తున్నారు. అందుకే మెక్సికన్‌ ప్రభుత్వం వీటిని చంపితే పదివేల డాలర్ల జరిమానా విధిస్తోంది.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...