Tuesday, February 08, 2011

బంగారము సంగతులేమిటి ?,What is about Gold?


బంగారాన్ని ఇంగ్లిషులో గోల్డ్‌ అంటారని తెలుసుగా? ఈ పదం పాత ఇంగ్లిషు పదమైన 'గెలో' నుంచి పుట్టింది. అంటే పసుపు రంగు అని అర్థం. బంగారాన్ని కేరట్లలో కొలుస్తారు . దానికీ ఓ కారణం ఉంది. ఒకప్పుడు విలువైన వస్తువులను కేరోబ్‌ గింజలతో తూచేవారట. దాని నుంచే కేరట్‌ పదం పుట్టిందని చెబుతారు. 24 కేరట్ల బంగారం అంటే పూర్తిగా శుద్ధమైందన్నమాట. ఆభరణాలు మాత్రం 22, 18, 14 కేరట్లలోనే లభిస్తుంటాయి. నగల తయారీ సమయంలో బంగారానికి రాగి లేదా వెండిని కలపడం వల్ల కేరట్ల సంఖ్య తగ్గుతుంది. వీటిని కలపకపోతే నగల తయారీ సాధ్యం కాదు. ఎందుకంటే పూర్తిగా శుద్ధమైన బంగారాన్ని ఇట్టే వంచేయవచ్చు. అది అంత మెత్తన. సాగే గుణం చాలా ఎక్కువ. ఔన్సు (28.35 గ్రాములు) బంగారాన్ని సాగదీసి, ఏకంగా 80 కిలోమీటర్ల పొడవైన తీగగా మార్చవచ్చని , దానినే ఒక పొరలాగా చేస్తే వంద చదరపు అడుగుల విస్తీర్ణం దాకా పరచుకుంటుంది! బంగారాన్ని దారాలుగా మార్చి అల్లికలకు కూడా ఉపయోగించవచ్చని సంబంధిత నిపుణులు , స్వర్ణకారులు చెప్తారు . .

* బంగారం ప్రస్తావన వేదాల్లోనూ కనిపిస్తుంది. ఇక ఏ పురాణాన్ని తీసుకున్నా దేవతల నగలన్నీ బంగారంతో చేసినవేగా? సింధు నాగరికత కాలంలోనే బంగారు నగలను ధరించినట్టు ఆధారాలున్నాయి. ఆభరణాలు చేసేటప్పుడు స్వర్ణకారులు బంగారాన్ని కాజేసే విధానాలను కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు కూడా.

* ఈజిప్టులో క్రీస్తు పూర్వం 2,600లోనే బంగారాన్ని వాడేవారు. లిడియా వారైతే గ్రీకులతో బంగారు నాణాలతోనే వ్యాపారం చేసేవారు. పర్షియన్‌ రాజు లిడియాను జయించిన తర్వాత బంగారు నాణాల వాడకం మొదలైంది.

* గనుల్లో మట్టి, రాళ్ళలో చిక్కుకుపోయి ఉండే బంగారాన్ని వెలికి తీయడం చాలా కష్టం. వెయ్యి కిలోల మట్టి నుంచి అరగ్రాము బంగారం లభిస్తుందని అంచనా. బంగారం ఉత్పత్తిలో ఇప్పుడు చైనాదే అగ్రస్థానం. దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాల్లో కూడా బంగారం గనులున్నాయి. మన దేశంలో కర్ణాటకలోని కోలార్‌లో ఉన్నాయి.

* భూకేంద్రంలో 10,000 కోట్ల టన్నుల వరకు బంగారం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. మరో 1,000 కోట్ల టన్నులు సముద్రాల్లో ఉందట.

* ప్రపంచం మొత్తం మీద 2009 వరకూ సుమారు 1,60,000 టన్నుల బంగారాన్ని వెలికి తీసినట్టు అంచనా. దీనితో 20 మీటర్ల భుజం ఉండే ఘనం తయారవుతుంది.

source : Eenadu new paper .
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...