Wednesday, October 26, 2011

దీపావళి వెనుక నిజాల వెలుగులు తెలుసా?,దీపావళి బాణసంచా కథలు-రికార్డులు ,What are the stories behing Diwali?



  • Courtesy with Eenadu news paper


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.



దీపావళి అంటే ఎంత సరదానో! మరి సరదా వెనుక నిజాల వెలుగులు తెలుసా? బాణసంచా కథలు, రికార్డులు విన్నారా?
అసలు బాణసంచా ఎక్కడ పుట్టిందో తెలుసా? చైనాలో. దీని వెనకాల రెండు కథలున్నాయి. చాలాకాలం క్రితం చైనాలోని హునాన్‌ ప్రాంతంలో లీ టియస్‌ అనే సాధువు కొన్ని రసాయనాల్ని కలిపి విచిత్రమైన మంటలు తెప్పించాడట. అవే టపాసులన్నమాట. ఆ సాధువుకు అక్కడ ఒక గుడి కూడా కట్టారు. ఏటా ఏప్రిల్‌ 18 ఆయనకు పూజలు చేసి బోలెడు టపాసులు కాలుస్తారు.
మరో కథ ప్రకారం 2000 ఏళ్లక్రితం చైనాలో ఓ వంటవాడు మూడు రకాల పొడులను వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గుపొడి, ఒక రకమైన లవణాలను ప్రాచీన చైనీయులు వెదురుబొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే 'ఢాంఢాం' అని పేలేది. ఇప్పటికీ టపాసుల తయారీలో ఆ మిశ్రమాన్నే వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాణాసంచా ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం కూడా అదే.

దివాళీ నగర్‌
దివాళీ నగర్‌ అనగానే మన దేశంలోని వీధి పేరో, ఊరి పేరో అనుకుంటున్నారా? కాదు, కరీబియన్‌ దీవిలో ఉన్న ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశంలోని ఒక ప్రాంతం పేరు. ఇక్కడ 13 లక్షల మంది మన దేశస్థులే. వారందరి కోసం దీపావళిని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ 1986 నుంచి దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నారు. వారికోసం ప్రభుత్వం కొంత ప్రాంతాన్ని దివాళీ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసింది. ఏటా పండగ కోసం కోట్ల రూపాయల విరాళాలు కూడా అందుతాయి.

బంగారు తళుకులు!
అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం తెలుసుగా? బంగారు పూతతో ధగధగలాడే ఆ ఆలయం దీపావళి నాడు మరింత వెలుగులీనుతుంది. సిక్కులు దీపావళి జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ సిక్కుల ఆరో గురువైన గురు హర్‌గోవింద్‌ సాహిబ్‌తోపాటు 52 మంది రాజులను ఓసారి చెరసాల్లో బంధిస్తాడు. వారిలో గురువును మాత్రం విడుదల చేయడానికి ఒప్పుకుంటాడు.తనతోపాటు రాజులందర్నీ విడుదల చేస్తేనే బయటకు వెళతానని గురువు పట్టుబడతాడు. దాంతో దీపావళి రోజు అందర్నీ విడుదల చేస్తారు. వాళ్లంతా గోల్డెన్‌ టెంపుల్‌కు వచ్చి వేడుకలు జరుపుకుంటారు. స్వర్ణ దేవాలయం నిర్మాణానికి 1577లో పునాది రాయిని వేసింది దీపావళి రోజునే.

ఢాంఢాం రికార్డులు!
*మాల్టా మక్బాలో 2011 జూన్‌లో అతి పెద్ద విష్ణు చక్రాన్ని కాల్చి రికార్డు సృషించారు. దీని చుట్టు కొలత 105 అడుగులు.
* ఫిలిప్పీన్స్‌లో గతేడాది 30 సెకన్లలో 1,25,801 తారాజువ్వల్ని వెలిగించడం గిన్నిస్‌ రికార్డు.
* ఇంగ్లండ్‌లో 2009లో 6.5 సెకన్లలో 1,10,000 రకాల బాణసంచా కాల్చారు.
*జపాన్‌లో అతి పెద్ద చిచ్చుబుడ్డిని 54.7 అంగుళాల వ్యాసం, 750 కిలోలతో తయారు చేశారు.
*చైనాలో 2007లో 13 కిలోమీటర్ల పొడవునా టపాసులను పరిచి కాల్చారు. ఇందుకోసం పది లక్షల డాలర్లని ఖర్చుపెట్టారు.
వూరంతా టపాసులే!
మనం కాల్చే టపాసులు ఎక్కడ తయారవుతాయో తెలుసా? తమిళనాడులోని శివకాశిలో. దేశంలో అమ్ముడయ్యే బాణసంచాలో 95 శాతం అక్కడే తయారవుతాయి. సుమారు 8000 టపాసుల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఉపాధి పొందేవారు 4 లక్షలపైనే! ఏటా సుమారు రూ. 600 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కువ టపాసుల్ని కాల్చే అతి పెద్ద పండగ మన దీపావళే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10వేల కోట్ల రూపాయల బాణసంచా వ్యాపారం జరుగుతోంది.
ఒక్కో చోట ఒక్కోలా...
*దీపావళి పండుగను బెంగాల్లో మహానిష అని పిలుస్తారు. కాళికా దేవిని పూజిస్తారు.
*బీహార్‌ గ్రామాల్లో యువకులు ధాన్యం, గడ్డిలను ఒక గంపలో వేసుకుని ఊరంతా తిరుగుతారు.
*మహారాష్ట్రలో యముడికి పూజలు చేసే సంప్రదాయం ఉంది.
*రాజస్థాన్‌లో పిల్లిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి పిల్లులకు పెడతారు.
*ఇతర దేశాల విషయానికి వస్తే సింగపూర్‌, మలేషియాలో అధికారిక సెలవు దినం. అమెరికా అధ్యక్ష భవనంలో కూడా దీపావళి పండగను చేస్తారు. వేడుకల్లో పాల్గొన్న తొలి అధ్యక్షుడు బరాక్‌ ఒబామానే!
*జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినట్టు చెబుతారు. ఆయన జ్ఞాపకార్థం జైనులు ఈరోజు ప్రార్థనలు చేస్తారు.

రంగులు ఇలా...
బాణసంచా కాలిస్తే బోలెడేసి రంగులు వస్తాయి. అవన్నీ రకరకాల రసాయనాల వల్ల ఏర్పడతాయి. అల్యూమినియం, టిటానియం వల్ల వెండి రంగు, బేరియంతో ఆకుపచ్చ, కాల్ఫియం వల్ల కాషాయం, కాపర్‌ వల్ల నీలం, మెగ్నీషియం వల్ల తెలుపు, సోడియం వల్ల పసుపు, స్ట్రోన్టియమ్‌తో ఎరుపు రంగులు ఏర్పడతాయి.

దీపావళి కథలు--
  • * రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగనుమనం జరుపుకుంటున్నాం.
* ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచిపొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడవిరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.
  • * మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.
* నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.
  • * ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చేసందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడినిఅందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...