Wednesday, December 28, 2011

What is Chota Char Dham yatra,చిన్న చార్‌ధామ్ యాత్ర అంటే ఏమిటి?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : చార్‌ధామ్ యాత్ర అంటే ఏమిటి ?
జ : యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదరీనాథ్‌ను కలుపుతూ చేపట్టే యాత్రను చార్‌ధామ్ యాత్ర అంటారు. ప్రతిఒక్క భారతీయుడు కాశీక్షేత్రాన్ని దర్శించాలనుకుంటాడు. అక్కడి గంగలో స్నానం చేసి, కాశీ విశ్వేశరుడిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భావిస్తారు. అలానే ఉత్తరాది వారంతా ఈ నాలుగు క్షేత్రాల యాత్ర, చార్‌ధామ్ యాత్ర చేస్తారు.

ఢిల్లీ నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంది యమునోత్రి. ఇది యమునానది పుట్టిన స్థలం. ఈ క్షేత్రంలో యమునాదేవి ఆలయం ప్రకృతి అందాల మధ్య ఠీవీగా కనిపిస్తుంది.హనుమాన్ చెట్టి నుంచి 14కిలోమీటర్లు కాలినడకన లేదా గుర్రాల మీద వెళ్లి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడికి కిలోమీటరు దూరం నిఠారుగా పైకి ఎక్కితే యమున పుట్టిన చోటు దర్శనం ఇస్తుంది.


ఇక గంగోత్రి గంగమ్మ పుట్టిల్లు. ఇక్కడి నుంచి 19 కిలోమీటర్లు కాలినడకన వెళితే గోముఖ్ వద్ద గంగమ్మ జన్మస్థానాన్ని చూడవచ్చ. అది కాస్తకష్టంతో కూడుకున్న పనే అయినా సాహసయాత్రికులకు ఆ ప్రయాణం మధురమైన అనుభూతినిస్తుంది. గంగోత్రిలో గంగామాత ఆలయం ఉంది. ఇక్కడ భాగీరథి నది ప్రవహిస్తుంది. అది మరింత కిందకు వెళ్లాక, దేవ ప్రయాగ వద్ద అలకనందతో కలిసి గంగగా మారుతుంది.



జోషీమఠ్‌కు చేరువలోని కేదార్‌నాథ్ యాత్ర మరచిపోలేని అనుభవాన్ని ఇస్తుంది.ఇక్కడ హిమాలయాల మధ్య ఉన్న కేదారనాథుని ఆలయం రమణీయంగా ఉంటుంది. శంకరాచార్యులు ఇక్కడే కైవల్యం పొందారు. సుమారు పది కిలోమీటర్ల దూరం కాలినడకన లేదా పోనీల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పాట్నా నుంచి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది.

బదరీనాథ్ ప్రయాణం మరింత అందంగా ఉంటుంది. సరస్వతి, గంగా నదుల చెంత ఉన్న బదరీనాథుని ఆలయం వరకు వాహనం వెళుతుంది. అక్కడ వ్యాసుడు నివశించిన గుహను చూడవచ్చు. చార్‌ధామ్ యాత్ర కేవలం ఆధ్యాత్మిక జీవులకే కాదు... సాహసయాత్రికులకు సైతం గొప్ప అనుభూతినిస్తుంది.
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...