Sunday, July 15, 2012

వీసా ఎలా పొందవచ్చు?,How can Visa get?,వీసా అంటే





...వీసా అంటే?
ఒక దేశం నుంచి మరో దేశానికి విద్య, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లాలంటే ఆదేశ ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం. అవసరమైన మేరకు పరిమిత కాలం పాటు ఇచ్చే అనుమతే వీసా. ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. అమెరికాకు వెళ్లేవారి కోసం హైదరాబాద్‌లో ఉన్న కాన్సులేట్ వీసాలను మంజూరు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా వీసాలు పొందే వారిలో భారత్‌దే అగ్రస్థానం. గతేడాది లక్షా మూడు వేలమంది భారతీయులు అమెరికన్ వీసా పొందారు. తరువాతి స్థానాల్లో చైనా, కొరియా, కెనడా, జపాన్ దేశాలున్నాయి. అమెరికాకు అత్యధికంగా రెవెన్యూ మన దేశం నుంచే. ఇందులోనూ సింహభాగం మన రాష్ట్రానిదే.

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అనుసరించే ప్రక్రియలో వీసా సాధించటం ఓ కీలక ఘట్టం. సాంకేతిక విద్యలో పీజీ చదవదల్చిన చాలామంది విద్యార్థులు ఈ విషయంలో అనవసరంగా ఆందోళన పడుతుంటారు. నియమ నిబంధనలను తెలుసుకుని, సక్రమంగా పాటిస్తే వీసా సులభంగానే పొందవచ్చు!

వేరే దేశంలో తాత్కాలికంగా నివాసం ఉండి, విద్యాభ్యాసం చేయటానికి చట్టబద్ధంగా అవకాశమిస్తుంది విద్యార్థి వీసా. యు.ఎస్‌. వీసా కోసమైతే ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సివుంటుంది కానీ, మిగతా దేశాలకు ఆ అవసరం కూడా లేదు. అవసరమైన పత్రాలను సక్రమంగా పూర్తి చేసి, సమర్పిస్తే సరిపోతుంది.

సెప్టెంబర్‌ ప్రవేశాల కోసం విద్యార్థి వీసా దరఖాస్తుల తరుణం మొదలైపోయింది. జులై, ఆగస్టు నెలల్లో వీసా అనుమతుల కోసం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా ఉంటాయి. విదేశాల్లో ప్రవేశం పొందిన వెంటనే ఈ ప్రక్రియను ఆరంభిస్తే 4- 6 వారాల్లోపే వీసా లభిస్తుంది. పెద్దగా దరఖాస్తుల తాకిడి లేకపోతే వారంలోపు కూడా వచ్చే అవకాశం ఉంది.

వీసా పొందటానికి పాటించాల్సిన ముఖ్యాంశాలను తెలుసుకుందాం!
* చూపించాల్సిన నిధులు: ట్యూషన్‌ ఫీజు, జీవన వ్యయం మొదలైనవాటికి సరిపోయేలా బ్యాంకు అకౌంట్లో ఏ మేరకు, ఎంత కాలం నిధుల నిల్వ చూపించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే అవసరానికి మించిన డబ్బు సమీకరించటానికి హైరానా తప్పదు. విద్యార్థి/ వారి తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్‌లోనే కాకుండా విద్యార్థుల తాత, నాయనమ్మ/అమ్మమ్మల లేదా స్పాన్సర్‌ చేసే బంధువుల పేర ఉండే అకౌంట్లనయినా అనుమతిస్తారు.

* డాక్యుమెంట్ల జాబితా: వీసా కోసం నిర్దిష్టంగా ఏ పత్రాలు అడిగారో వాటిని మాత్రమే సమర్పిస్తే చాలు. లెక్కలేనన్ని పత్రాలను జోడించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు యు.కె., కెనడాలలో వీసా కోసం- ఆస్తి డాక్యుమెంట్లు గానీ, ఆదాయానికి సంబంధించిన రిటర్న్స్‌ గానీ చూపించనక్కర్లేదు. ఆస్ట్రేలియాకు కూడా ఆస్తి డాక్యుమెంట్లు చూపనక్కర్లేదు. కోర్సు పూర్తిచేయటానికి బ్యాంకు రుణం/ఫిక్సెడ్‌ డిపాజిట్లు/బ్యాంకు నిల్వ సరిపోను ఉందా లేదా అనేది చూస్తారు.

* దరఖాస్తు పత్రాలు: వీసా దరఖాస్తు పత్రాలు తరచూ మారుతుంటాయి. వెబ్‌సైట్‌ నుంచి తాజా పత్రం డౌన్‌లోడ్‌ చేసుకుని, సక్రమంగా భర్తీ చేసి సమర్పించాలి. ఎప్పుడో సేకరించిన పాత దరఖాస్తును నింపి, పంపితే దాన్ని ఆమోదించరు.

* దరఖాస్తుల సమర్పణ: అడిగిన వివరాలన్నిటితో దరఖాస్తు పూర్తిచేశాక వాటిని సంబంధిత VFSకేంద్రంలో సమర్పించాల్సివుంటుంది. ఎంబసీ వారు ఈ కేంద్రాల ద్వారానే దరఖాస్తులను స్వీకరిస్తారు. యు.కె. కోసమైతే వెబ్‌సైట్‌లో ముందస్తుగా అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆ నిర్దిష్ట తేదీనాడే దరఖాస్తును సమర్పించాల్సివుంటుంది.

* వైద్య పరీక్ష: కెనడా వీసాకు దరఖాస్తు చేసేటపుడే వైద్యపరీక్ష వివరాలు అందజేయాలి. ఆస్ట్రేలియా, యు.కె.లలో అయితే హైకమిషన్‌ తెలిపిన తర్వాతే వైద్యపరీక్ష వివరాలు సమర్పించాల్సివుంటుంది.

దరఖాస్తు ఘట్టం ముగిశాక అవసరమైతే టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ ఉండవచ్చు. చదవబోయే విద్యాసంస్థ నుంచి ప్రవేశం నిర్థారణ లేఖ సరిగా ఉండాలి. పత్రాలన్నీ సక్రమంగా ఉంటే సాధారణంగా నాలుగు వారాల్లోపే వీసాను మంజూరు చేస్తారు. దరఖాస్తుల సంఖ్య పెరిగినకొద్దీ వీసా మంజూరు చేసే కాలవ్యవధి కూడా పెరగవచ్చు. అందుకే వీలైనంత ముందుగానే దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం!

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-