Wednesday, June 12, 2013

What is this PRISM(USA)?,ఏమిటీ ప్రిజమ్‌?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


'ప్రిజమ్‌' అనేది అమెరికాలోని జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) చేపట్టిన అత్యంత రహస్య ఎలక్ట్రానిక్‌ నిఘా కార్యక్రమం. అధికారికంగా దీన్ని 'యూఎస్‌-984ఎక్స్‌ఎన్‌' అని పేర్కొంటారు. దీని కింద నెట్‌ ద్వారా సాగే లైవ్‌ కమ్యూనికేషన్లు, నిల్వ చేసిన సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తున్నారు. అమెరికా పౌరులు కాని, ఆ దేశం వెలుపల ఉండేవారిని కాని లక్ష్యంగా చేసుకొనేందుకు ఇది వీలు కల్పిస్తోంది. దీనికింద ఈ-మెయిల్‌, వీడియో, వాయిస్‌ చాట్‌, ఫొటోలు, వాయిస్‌ఓవర్‌ ఐపీ సంభాషణలు, ఫైల్‌ ట్రాన్స్‌ఫర్లు, లాగిన్‌ నోటిఫికేషన్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వివరాలను పొందడానికి వీలు కలుగుతుంది. ప్రిజమ్‌ను 2007 డిసెంబర్‌లో ప్రారంభించారు. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత జార్జి బుష్‌ సర్కారు తెచ్చిన 'ఉగ్రవాద నిరోధక కార్యక్రమం' స్థానంలో దీన్ని చేపట్టారు. ఉగ్రవాద నిరోధక కార్యక్రమంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాని చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తాయి. విదేశీ గూఢచర్య నిఘా కోర్టు(ఎఫ్‌ఐఎస్‌సీ) అనుమతి లేకుండా దీన్ని చేపట్టడమే ఇందుకు కారణం. ప్రిజమ్‌ను మాత్రం ఈ కోర్టు అనుమతించింది. 2007లో బుష్‌ ప్రవేశపెట్టిన 'ప్రొటెక్ట్‌ అమెరికా యాక్ట్‌', ఎఫ్‌ఐఎస్‌ఏ సవరణ చట్టం ప్రిజమ్‌ ప్రారంభానికి వీలు కల్పించాయి. దీనివల్ల నిఘా సంస్థలతో సహకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే కంపెనీలకు చట్టబద్ధమైన రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. 2012లో ఒబామా హయాంలో కాంగ్రెస్‌ దీన్ని ఐదేళ్ల పాటు అంటే.. 2017 డిసెంబర్‌ వరకూ పొడిగించింది. ఎఫ్‌ఐఎస్‌ఏ సవరణ చట్టం ప్రకారం- కమ్యూనికేషన్లు సాగిస్తున్న పార్టీల్లో ఒకరు అమెరికా వెలుపల ఉంటే, ఎలాంటి వారెంట్‌ లేకుండానే అమెరికా పౌరుల ఫోన్‌, ఈమెయిల్‌, ఇతర కమ్యూనికేషన్లను పర్యవేక్షించే అధికారం నిఘా సంస్థలకు ఉంటుంది. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ పథకాన్ని ఎన్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేశారు. ఎన్‌ఎస్‌ఏ చరిత్రలో ఇది పెద్ద లీకేజీగా భావిస్తున్నారు. అంతా గోప్యంగా ఉంచుతామని గొప్పలు చెప్పుకొనే ఆ సంస్థలో ఇది చోటుచేసుకోవడం గమనార్హం. స్నోడెన్‌ లీక్‌ చేసిన పత్రాల్లో 41 పవర్‌ పాయింట్‌ స్త్లెడ్‌లు ఉన్నాయి. సిబ్బందికి శిక్షణ కోసం వీటిని రూపొందించినట్లు భావిస్తున్నారు. వీటిని లీక్‌ చేసిన స్నోడెన్‌.. అమెరికా ప్రాసిక్యూషన్‌, వేధింపుల భయంతో ప్రస్తుతం హాంకాంగ్‌లో తలదాచుకుంటున్నారు. ఆయన్ను అప్పగించాల్సిందిగా అమెరికా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ఐస్‌ల్యాండ్‌ ఆశ్రయాన్ని ఆయన కోరుతున్నారు. ప్రిజమ్‌ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ దేశాలు అమెరికాను నిలదీస్తున్నాయి. బ్రిటన్‌లో ప్రభుత్వ కమ్యూనికేషన్ల ప్రధాన కార్యాలయం(జీసీహెచ్‌క్యూ)కు ప్రిజమ్‌ కార్యక్రమంతో యాక్సెస్‌ ఉన్నట్లు తేలింది.

ఎలా చేస్తారు?
ప్రిజమ్‌ కింద.. నెట్‌లో డేటాను ఎలా సేకరిస్తున్నారన్నది తేలలేదు. తాము నేరుగా అనుసంధానం కల్పించలేదని టెక్‌ కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో సమాచారాన్ని ఎన్‌ఎస్‌ఏ ఎలా సేకరిస్తోందన్నది అయోమయంగా ఉంది. ఆయా సంస్థలకు తెలియకుండానే ఇది జరుగుతోందని కొందరు సైబర్‌ నిపుణులు వాదిస్తుండగా.. ఇంకొందరేమో ఆ సంస్థలు దొడ్డిదారిన ఎన్‌ఎస్‌ఏకు అనుసంధానత కల్పించి ఉంటాయని భావిస్తున్నారు.
* బహిర్గతమైన ప్రిజమ్‌ స్త్లెడ్ల ప్రకారం.. అప్‌స్ట్రీమ్‌ కార్యక్రమం కింద తొలి వనరు అయిన ఇంటర్నెట్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లకు సంబంధించిన వ్యవహారాలను చూస్తారు. రెండో వనరు అయిన ప్రధాన ఇంటర్నెట్‌ కంపెనీల సర్వర్లను ప్రిజమ్‌ పర్యవేక్షిస్తుంది. * ఎన్‌ఎస్‌ఏలోని కలెక్షన్‌ మేనేజర్లు.. కంటెంట్‌ టాస్కింగ్‌ సూచనలను నేరుగా కంపెనీ సర్వర్లకు కాకుండా కంపెనీ నియంత్రిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరికరాలకు పంపుతూ ఉండొచ్చని ఒక అంచనా. ఆ విధంగా కావాల్సిన డేటాను సేకరిస్తున్నారని భావిస్తున్నారు. * మరో విశ్లేషణ ప్రకారం.. ట్విట్టర్‌ మాత్రం ప్రభుత్వ సంస్థలకు సహకరించేందుకు నిరాకరించింది. మిగతా కంపెనీలు మాత్రం సహకరించాయి. డేటాను సమర్థంగా, సురక్షితంగా అందుబాటులో ఉంచే విధానాలపై కంపెనీలు ఎన్‌ఎస్‌ఏ సిబ్బందితో చర్చలు కూడా జరిపాయి. కొన్ని సందర్భాల్లో నిఘా వర్గాలకు అనువుగా తమ సిస్టమ్స్‌కు మార్పులు చేర్పులు చేశాయి. కోర్టు ద్వారా అందే వినతులకు స్పందనగా డేటాను అందించడం చట్టబద్ధంగా తప్పనిసరే. అయితే సిస్టమ్స్‌లో మార్పులు చేర్పులు చేసి, డేటా సేకరణను ప్రభుత్వానికి సులువు చేయడం మాత్రం తప్పనిసరి కాదు. అందువల్లే మరింత మెరుగైన అనుసంధానతకు ట్విట్టర్‌ నిరాకరించి ఉంటుందని భావిస్తున్నారు. మిగతా కంపెనీలను ఒక లాక్డ్‌ మెయిల్‌ బాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు కోరి ఉంటారని విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించిన 'కీ'ని ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించి ఉంటారని భావిస్తున్నారు. * సిస్కో వంటి సంస్థలు రూపొందించిన రూటర్ల ద్వారా ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ను మళ్లించి, నేరుగా ట్యాప్‌ చేసి ఉంటారని కూడా మరో విశ్లేషణ ఉంది. ఈ ట్రాఫిక్‌ అంతా ఎన్‌క్రిప్ట్‌లో ఉంటుంది. దీన్ని డీక్రిప్ట్‌ చేయాలంటే కంపెనీల వద్ద ఉండే 'మాస్టర్‌ కీ' అవసరం.

Courtesy with Eenadu news paper(5:24 AM 12-Jun-13
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...