Sunday, November 30, 2014

Cannot feel taste when suffer cold?- జలుబుంటే రుచి తెలియదా?,

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


ప్రశ్న: జలుబు చేస్తే ఆహార పదార్థాల రుచి, వాసన సరిగా తెలియదు. ఎందుకు?

జవాబు: సాధారణ జలుబు (common cold) ను వైద్యశాస్త్ర పరిభాషలో నాసో ఫేరింజిటిస్‌ (naso pharyngitis)అంటారు. జలుబుకు కారణం వైరస్‌లు. దాదాపు 20 రకాల వైరస్‌ల వల్ల జలుబు వచ్చే ప్రమాదమున్నా ప్రధానంగా రైనో వైరస్‌ వల్ల వస్తుంది. జలుబు అంటువ్యాధి. ఈ వైరస్‌లు గాలి ద్వారా, శరీర స్పర్శ ద్వారా ఒకర్నించి మరొకరికి సోకుతాయి. దగ్గు, బొంగురు గొంతు, అదేపనిగా ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం జలుబుకున్న ప్రధాన లక్షణాలు. జలుబుకు చికిత్స లేదు. కాబట్టి ప్రకటనలు విని డబ్బులు వృథా చేసుకోవద్దు.

జలుబు చేసినపుడు ముక్కులో ఉన్న ఘ్రాణేంద్రియ కణాల మీద వైరస్‌ కణాలు దాడిచేస్తాయి. వాటి పీచమణచడానికి మన రక్షక కణాలయిన తెల్లరక్తకణాలు యుద్ధం చేస్తాయి. అలాగే నోటిలో, నాలుకతో పాటు అన్ని వైపులా ఈ వైరస్‌లు దాడిచేయడం, వాటి మీద రక్షక కణాలు యుద్ధం చేసి తొలగించడం పరిపాటి.మరోమాటలో చెప్పాలంటే వాసన చూడాల్సిన ముక్కు, రుచి చూడాల్సిన నాలుక వైరస్‌, తెల్ల రక్తకణాల మధ్య యుద్ధ భూములుగా మారతాయన్నమాట.అటువంటి పరిస్థితిలో తిన్న ఆహార పదార్థాల్లోని వాసన నిచ్చే అణువుల్ని, రుచిని కలిగించే రసాయనాల్ని ఆయా ఇంద్రియావయవాలు సరిగా గుర్తించలేవు. అందుకే జలుబున్నపుడు వాసన, రుచి మందగిస్తాయి.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; --కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...