Saturday, January 03, 2015

Cell towers are dangerous?,సెల్‌ టవర్లతో ప్రమాదమా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: సెల్‌ఫోను టవర్ల వల్ల ప్రమాదం ఉందంటారు. పైగా ఎక్కువసేపు మాట్లాడితే ఫోను వేడెక్కుతుంది. ఎందుకు?
జవాబు: సమాచార రంగంలో సెల్‌ఫోను వ్యవస్థ విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చింది. దేశ జనాభా సుమారు 120 కోట్లు ఉండగా మన దేశంలో సుమారు 80 కోట్ల వరకు సెల్‌ఫోను నంబర్లు చలామణీలో ఉన్నట్టు తెలుస్తోంది. 2జీ, 3జీ, 4జీ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్‌ సాంకేతిక రూపాల్లోకి మాటలతోనే కాకుండా దృశ్య రూపేణా అందర్నీ తీసుకు రాగలిగింది. విద్యుదయస్కాంత తరంగాలను వాహకాలుగా వాడుకుంటూ అబ్బురపర్చే ఎలక్ట్రానిక్స్‌ మాడ్యులేషన్ల పద్ధతిలో వివిధ సెల్‌ఫోను సంస్థలు పనిచేస్తున్నాయి.

ఇన్ని కోట్ల ఫోన్లున్నా మాట్లాడాలనుకున్న వ్యక్తి సెల్‌ నెంబర్‌ సరిగ్గా నొక్కగానే వారితో వెంటనే మాట్లాడగలగడం సెల్‌ఫోను వ్యవస్థలో ఉన్న సాంకేతిక వైశిష్టతే. సెల్‌ఫోనుల్లో సూక్ష్మ తరంగాల్ని వాడతారు. సుమారు 800 కిలోహెర్ట్జ్‌ నుంచి సుమారు 3 గెగాహెర్ట్జ్‌ ఉన్న సూక్ష్మ తరంగాల్ని సెల్‌ఫోను టవర్ల ద్వారా బకదాని నుంచి మరో సెల్‌ఫోనుకు సంధానం చేస్తారు.

సెల్‌ఫోను వ్యవస్థలో టవర్లు చాలా కీలకమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలిబుచ్చిన ప్రకటన ప్రకారం సెల్‌ఫోను టవర్ల వల్ల దగ్గరున్న ప్రజలకు, పక్షులకు ఏ మాత్రం హాని లేదు. కానీ సెల్‌ఫోనును అదే పనిగా చెంప దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే ఆ సూక్ష్మ తరంగాల ధాటికి తల భాగంలో వేడెక్కి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎలక్ట్రానిక్‌ పరికరం ఏదైనా అదే పనిగా వాడినట్లయితే వేడి ఉత్పన్నం కావడం సహజం. ఇందుకు సెల్‌ఫోన్లు మినహాయింపు కాదు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య,నిట్‌,వరంగల్‌;జనవిజ్ఞానవేదిక,శాస్త్రప్రచారవిభాగం(తెలంగాణ)
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...