Saturday, March 07, 2015

If water present instead of blood-మన శరీరంలో రక్తానికి బదులు నీళ్లే ఉంటే ఏమయ్యేది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !



ప్రశ్న: మన శరీరంలో రక్తానికి బదులు నీళ్లే ఉంటే ఏమయ్యేది? రక్తం ప్రత్యేకతేంటి?

జవాబు: శరీరంలో పలు జీవన కార్యకలాపాలు జరగాలంటే శక్తి కావాలి. ఓ కారు నడవడానికి పెట్రోలు యంత్రంలో మండడం వల్ల వచ్చే శక్తిని వినియోగించుకుంటుంది. ఇక్కడ గాలిలోని ఆక్సిజన్‌ పెట్రోలును మండిస్తుంది. మండటం అంటే ఇంధనంలోని అణువులను ఆక్సిజన్‌తో సంధానించి ఆక్సీకరణం చేయడమే.
మన శరీరంలోని కార్యకలాపాలు నడవాలంటే మనకూ ఓ ఇంధనం అవసరం. ఆ ఇంధనమే గ్లూకోజు. మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజు లభ్యమవుతుంది. దీనిని రక్తం శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. కానీ ఇంధనంలోని శక్తిని రాబట్టాలంటే ఆక్సిజన్‌ కూడా కావాలి. దానిని మనం శ్వాసక్రియ ద్వారా రక్తంలోకి పంపుతాం. రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్‌ శ్వాసక్రియలో వూపిరితిత్తుల్లోంచి స్వీకరిస్తుంది. రక్తం బదులు మొత్తం నీరే ఉన్నట్లయితే ప్రతి కణానికి గ్లూకోజు అందుతుంది కానీ ఆక్సిజన్‌ అందదు. ఎందుకంటే నీటిలో గ్లూకోజు కరిగినంతగా ఆక్సిజన్‌ కరగదు. ఆక్సిజన్‌ను అధిక మోతాదులో మోయగల హిమోగ్లోబిన్‌ అవసరం. అలాగే శరీరానికి గాయం తగిలితే సూక్ష్మ క్రిముల బారి నుంచి శరీరాన్ని రక్షించాలన్నా, వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడాలన్నా సైన్యంలాగా తెల్ల రక్త కణాలు అవసరం. ఇవి నీటిలో కరగవు. ఇలా ఎన్నో జీవ రసాయనాలు కలిసి ఉన్న నీటినే రక్తం అంటాం. రక్తంలో నీరు 70 శాతం వరకు ఉంటుంది. ఉత్త నీటి వల్ల లాభం లేదు. నీటిలో నిమగ్నమై ఉన్న పలు జీవ రసాయనాల, వర్ణ ద్రవ్యాల సమాకలనమే రక్తం. ఇది గాయం తగిలితే గడ్డ కడుతుంది. నీరు గాయం తగిలితే కారిపోతూ ఉండేది. రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ గడ్డ కట్టడంలో ఉపకరిస్తాయి.

రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి .నైట్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  •  ============================
... visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...