Saturday, August 01, 2015

కరెంటు బొగ్గు నుంచీ.నీటి నుంచే తయారు చేస్తారు కానీ వేరే సాధనాల నుంచి ఎందుకు తయారు చేయరు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...






 ప్రశ్న: కరెంటు బొగ్గు నుంచీ.నీటి నుంచే తయారు చేస్తారు కానీ వేరే సాధనాల నుంచి ఎందుకు తయారు చేయరు?

జవాబు: కరెంటు లేదా విద్యుచ్ఛక్తిని బొగ్గులో ఉన్న రసాయనిక శక్తిని మార్చుకోవడం ద్వారా ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తారు. ఆనకట్టల దగ్గర ఎత్తులో నిల్వ ఉన్న నీటిలోని స్థితి శక్తిని విద్యుచ్ఛక్తిగా జల విద్యుత్‌ కేంద్రాలలో ఉత్పత్తి చేస్తారు. ఇలా శక్తిని ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడానికి వీలున్న అన్ని విధానాలలోను విద్యుచ్ఛక్తిని తయారు చేయగలం. ఉష్ణ విద్యుత్తు, జల విద్యుత్తే కాకుండా సౌర ఘటాల్లో సూర్యుని కాంతిలో ఉన్న కాంతి శక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది. పెద్ద పెద్ద పర్వత శ్రేణుల వాలు మీద అమర్చిన పంఖాల్లాంటి పరికరాల ద్వారా వీచే గాలిలో ఉన్న గతిశక్తిని విద్యుచ్ఛక్తిగా వాయు యంత్రాలలో మారుస్తున్నాం. సముద్రపు అలలలో ఉండే గతిశక్తిని విద్యుచ్ఛక్తిగా తరంగ యంత్రాలలో ఉత్పత్తి చేస్తున్నాం. భూమి పొరల్లో వివిధ ఉష్ణోగ్రతల తేడాల వల్ల సిద్ధించిన ఉష్ణశక్తిని భూగర్భ విద్యుదుత్పత్తి కేంద్రాలలో విద్యుచ్ఛక్తిగా మార్చుకొంటున్నాం. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లలో దాగున్న రసాయనిక శక్తిని ఇంధన ఘటాల్లో విద్యుచ్ఛక్తిగా మార్చుకొని వాడుకొంటున్నారు. ఇలా ఎన్నో రూపాల్లో ఉన్న శక్తిని విద్యుచ్ఛక్తిగా వాడుతూనే ఉన్నాం. అయితే మన అవసరాలను ఎక్కువగా తీర్చేది బొగ్గు, జల విద్యుత్తే.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...